Pages

Sunday, December 14, 2014

నల్గొండ జిల్లాలో మిషన్ కాకతీయ రెడీ

మిషన్ కాకతీయ రెడీ
⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు
⇒ నేడు జెడ్పీటీసీ, ఎంపీపీలకు అవగాహన సదస్సు
⇒ హాజరుకానున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

556 మైనర్ ఇరిగేషన్ చెరువులు
4193 చిన్ననీటి చెరువులు (పంచాయతీరాజ్)
13 అటవీశాఖ పరిధిలో చెరువులు
4762 మొత్తం చెరువుల సంఖ్య

మొదటిదశలో చెరువుల మరమ్మతులు ఇలా...
⇒ 952 పునరుద్ధరణ జరిగే చెరువులు
⇒ 185 ఇప్పటి వరకు సర్వే చేసిన చెరువులు
⇒ 102 ప్రభుత్వానికి అంచనావ్యయం సమర్పించిన చెరువుల సంఖ్య
⇒ రూ.83కోట్లు ఖర్చు అంచనా,మంజూరు ఈ-టెండరు ద్వారా పనుల కేటాయింపు

నల్లగొండ: చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమవుతోంది. కబ్జాకోరల్లో చిక్కుకుపోయి, ఆనవాళ్లు కోల్పోయిన ఆనాటి చెరువులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో ‘మిషన్ కాకతీయ’ ప్రధానమైనది. ఈ పథకం అమలు తీరుతెన్నులు సమీక్షించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.


ఈ నేపథ్యంలో మంత్రి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండుగంటలకు జెడ్పీ ప్రత్యేక సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు కాకతీయమిషన్ ముఖ్య ఉద్దేశాలను మంత్రి వివరిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

కాకతీయ మిషన్ తీరు
జిల్లావ్యాప్తంగా మొత్తం 4,762 చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి. దీంట్లో 556 చెరువుల పరిధిలో వంద ఎకరాలపైబడి ఆయకట్టు సాగవుతోంది. మరో 4,193 చెరువుల కింద వందఎకరాల్లోపు ఆయకట్టు ఉంది. అటవీశాఖ పరిధిలో 13 చెరువులు ఉన్నాయి. దీంట్లో చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురిగాక, చిన్నచిన్న నీటి కుంటలను పూడ్చేసి రియల్ వ్యాపారులు వెంచర్లు చేసి అమ్మేశారు. కోదాడ, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురైనట్లు జిల్లా పంచాయతీ శాఖ గతంలో చేపట్టిన విచారణలో తేలింది.

ప్రస్తుతం సాగునీటి పారుదలశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా చెరువుల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతగానీ ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయనేది తేలుతుంది. అయితే ప్రభుత్వం ముందుగా 20 శాతం చెరువులు అంటే.. 952 చెరువులను 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 185 చెరువులసర్వే పూర్తయ్యింది. దీంట్లో 102 చెరువులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.

ఈ పనుల అంచనా విలువ సుమారు రూ.83 కోట్లు. ఈ పనులను ఈ-టెండర్ ద్వారానే చేపడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన 15రోజుల్లోగా అగ్రిమెంట్, ఇతర వ్యవహారాలన్నీ పూర్తిచేసి పనులు ప్రారంభించాలి. ఈ నెలాఖరునాటికి సర్వే పూర్తిచేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. మొత్తం మీద జనవరి మొదటివారంలో మిషన్ కాకతీయ ఆచరణలోకి వస్తుంది.

నీటి నిల్వ ఉన్న చెరువుల పనులు ఆలస్యం...
నాగార్జునసాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతాలైన హుజూర్‌నగర్, భువనగిరి, రామన్నపేట, తదితర ప్రాంతాల్లో సుమారు 65 చెర్వుల్లో నీటినిల్వలు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వరికోతలు పూర్తయిన తర్వాత ఆ చెరువుల పరిధిలో పనులు ప్రారంభిస్తారు.

ఇవీ చేపట్టే పనులు
అలుగులు రిపేరు, చిన్నచిన్న నీటి కుంటల నుంచి పంట పొలాలకు వెళ్లే కాల్వల మరమ్మతులు, స్లూయీస్ మరమ్మతులు, చెరువుల పూడికతీత, సర్కారు చెట్లు, గుర్రపు డెక్క తొ లగింపు, ఫీడర్‌ఛానల్ మరమ్మతులు, చెరువుల పూడకతీతలో భాగంగా తీసిన మట్టి తో చెరువుల కట్టలు నిర్మిస్తారు.


No comments:

Post a Comment