పట్టుపట్టితే సాధించలేనిది లేదు
పట్టుపట్టితే సాధించలేనిది ఏదీ ఉండదని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తెలంగాణ అభివృద్ధిపై పట్టుబట్టి పనిచేస్తే దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నిధుల కొరత ఎంతమాత్రం లేదని, రాష్ట్రంలో చిన్నపాటి లిటిగేషన్‌లో ఉన్న భూములను కొంత మేరకు అమ్ముకుంటేనే రూ.25వేల కోట్ల ఆదాయం వస్తుందని, ఆ ఆదాయంతో తెలంగాణలో ఉన్న దారిద్య్రాన్ని పారదోలుతామని పేర్కొన్నారు. బుధవారం కేసీఆర్ మెదక్ జిల్లా ఘణపురం ఆయకట్టు పరిసర ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత మెదక్ పట్టణంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షాసమావేశం నిర్వహించారు.
-తెలంగాణ సాధనే నిలువెత్తు నిదర్శనం
-రాష్ర్టాన్ని దారిద్య్రంనుంచి బయటపడేద్దాం
-అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
-ఘణపురంప్రాజెక్ట్ ఆధునీకరణకు 50 కోట్లు
-ప్రాజెక్ట్ ఏరియల్ సర్వే చేసిన సీఎం కేసీఆర్
-మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
ఘణపురం ఆయకట్టు పెంచుతాం..: మెదక్ జిల్లాలో లిప్టు అవసరం లేకుండా ఉన్న ఏకైక ప్రాజెక్టు ఘణపురం. ఇక్కడి రైతులకు ఇదొక్కటే ఆధారం. గతంలో జన్మభూమిలో కొంత, మాజీ మంత్రి కరణం రామచంద్రారావు ఉన్నప్పుడు కొంతమేరకు అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గుర్తు చేశారు. ప్రాజెక్ట్ కింద నాకు తెలిసి ఇప్పుడు 8 వేల నుంచి 10 వేల ఎకరాలు ఆయకట్టు కూడా లేదని.. వాస్తవానికి కనీసంగా 25 వేల నుంచి 27వేల ఎకరాల ఆయకట్టు ఉండాలన్నారు. ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చే ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి చూశానని, ఘణపురం ఆనకట్టుకు పై భాగంలో మంజీర నదిపై చెక్‌డ్యాంలు నిర్మించుకోవాల్సి ఉన్నదన్నారు.
ఘణపురంఆనకట్టను పెద్దగా(ఎత్తు పెంచుకోవడం) చేసుకుంటే కొల్చారం మండలం మునిగిపోతుందని కొంతమంది అనుకుంటున్నారని, కానీ ఎవరిదీ గుంటభూమి మునగదని స్పష్టం చేశారు. కట్టలు పోసుకుని సిమెంట్ గోడలు కుట్టుకుంటే 6 నుంచి 8 కిలోమీటర్ల మేరకు నీళ్లు స్టోర్ అయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.
ఘణపురంప్రాజెక్టు కాలువ మరమ్మతుకు ఇప్పటికే జపాన్ ఆర్థిక సహాయం కింద (జైకా నిధులు) రూ.19 కోట్ల మంజూరయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంపుతోపాటు పూర్తిస్థాయిలో ఆధునీకరణకు రూ.50 కోట్లు అవసరం ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనాకు వచ్చారని.. వాటిని వెంటనే మంజూరు చేస్తున్నామని, రేపే జీవో విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రకటించారు.
విప్లవంలా మొక్కలు నాటుదాం: మెదక్ జిల్లాతోపాటు తెలంగాణవ్యాప్తంగా రిజర్వు ఫారెస్టు(అటవీ) భూములున్నా.. చెట్లు లేవని, అందుకే వర్షాలు పడటం లేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హరితవనం కార్యక్రమం చేపట్టింద ని, సమైక్య పాలనలో నాశనమైన అడవులను తిరిగి పునరుద్ధరించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా సర్వాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి వచ్చిన సందర్భాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మీ వద్ద కాలం ఎట్లుందని ఆ రైతును అడిగితే.. కాలం తో మాకు పనిలేదు సార్. మా ఊరు అడవిలో ఉన్నది. వర్షాలు బాగా పడతాయి. మాకు కరువేలేదు. అని అన్నాడని చెప్పారు. అడవులు ఉంటే కరువు ఉండదనడానికి ఆ రైతు చెప్పిన మాటలే నిదర్శనమన్నారు. మొక్కలు పెంచి అడవులను పునరుద్ధరించుకోవాలని ఇందుకు కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధులు ఇందుకు నడుంకట్టాలన్నారు. రాష్ట్రంలో మొక్కల పెంపకం ఓ విప్లవంగా రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మొక్కల పెంపకానికి ప్రియాంక వర్గీస్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించాం. రాబో యే మూడేండ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రణాళికలు పెట్టుకున్నాం. తెలంగాణ కోసం జెండా పట్టినప్పుడు ఇది అయ్యే పనేనా..? అని చాలా మంది జోక్ చేసిండ్రు. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఉండదనడానికి తెలంగాణ సాధనే నిదర్శనం అని అన్నారు.
ఇంటింటికీ నీళ్లివకుంటే ఓట్లడగం: రానున్న నాలుగేండ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మెదక్ నియోజకవర్గం రానున్న రెండేండ్లలోనే ఇంటింటికీ నీరందించే లిస్ట్‌లో ఉన్నదని సీఎం పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని రెండేండ్లలోగా ప్రతి ఇంటికీ.. ఆ ఇంటి యజమాని సూచించిన చోట నల్లా కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. మెదక్ నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని వీధుల్లో కనిపించకూడదని అన్నారు. అలా కనిపిస్తే ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాజీనామాలు చేయాలని కేసీఆర్ నవ్వుతూ అన్నారు. ప్రజాప్రతినిధులంతా నరసింహ అవతారాలు ఎత్తాలని, ఇంటింటికీ నీరందించే మహాత్తర కార్యక్రమాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటా..: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులందరినీ గౌరవంగా చూసుకుంటామని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట సాధనకు కోసం ప్రపంచమే గర్వించదగిన విధంగా 40 రోజులపాటు సకల జనుల సమ్మె నిర్వహించి శభాష్ అనిపించుకున్నారని గుర్తు చేశారు. ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డులు ఇస్తామని అందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యోగులంతా తెలంగాణ పునర్‌నిర్మాణంలో పాలు పంచుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
గ్రామాల్లో మట్టి రోడ్ల పనులు స్థానికులకే..: ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి గ్రామాల్లో చేపట్టనున్న మట్టి రోడ్ల నిర్మాణ పనుల బాధ్యతను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, స్థానికులకే అప్పగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కేసీఆర్ చెప్పారు. కిలో మీటర్‌కు రూ.3లక్షల చొప్పున నిర్మాణం చేపట్టబోయే మట్టి రోడ్లు స్థానికులే చేసుకుంటారని, ఇందులో కాంట్రాక్టర్ల ప్రమేయం ఏమాత్రం ఉండబోదని స్పష్టం చేశారు. గుంతలు లేని రోడ్లు నిర్మించి దేశంలోనే బెస్ట్ తెలంగాణ పేరు తెచ్చుకోవాలని అన్నారు.
లిటిగేషన్ భూములమ్మితే రూ. 25 వేల కోట్ల ఆదాయం: రాష్ట్రవ్యాప్తంగా చిన్నపాటి లిటిగేషన్‌లో ఉన్న ప్రభుత్వ భూముల్లోని రెండు, మూడు తునకలు అమ్ముకుంటే సర్కారుకు రూ. 25 వేల కోట్ల ఆదాయం వస్తుందని కేసీఆర్ వెల్లడించారు. సర్కారుకు ఏ మా త్రం నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. అన్ని డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను అధునానత హం గులతో నిర్మిస్తామని అన్నారు. భూములు అమ్ముకోగా వచ్చే నిధులతో అన్ని జిల్లా దారిద్రాన్ని తరిమివేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
మెదక్‌కు సీఎం వరాల జల్లు: మెదక్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిని తన కూతురుగా అభివర్ణించిన సీఎం.. తన బిడ్డ నియోజకవర్గం బాగుండాలన్నారు. మెదక్ పట్టణంలో డబుల్ డివైడర్లు నిర్మించి బటర్‌ైఫ్లె లైట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహూల్ బొజ్జాను ఆదేశించారు. మెదక్ పట్టణ కేంద్రంలో షాదీఖానా నిర్మాణానికి రూ.కోటి, నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.15 లక్షలు, మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు రూ.25లక్షలు, మెదక్ పట్టణ అభివృద్ధికి మరో రూ.కోటీ సీఎం కేసీఆర్ సభలో మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాను న్న రోజుల్లో వనరులను బట్టి మెదక్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రౌనేజీ, రోడ్ల మరమ్మతు చేపడతామని హామీ ఇచ్చారు.
చిన్నశంకరంపేట 132 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కేసీఆర్ మంజూరు చేశారు. వచ్చే బడ్జెట్‌లో మెదక్‌కు రింగ్‌రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన మెదక్‌ను జిల్లా కేంద్రం చేస్తామని ప్రజాప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో కొందరు ఊ అంటే అంటే ధర్నా చేస్తున్నారని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మాట ఇస్తే తలతెగిపడ్డా తప్పవద్దని.. మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. డిలిమిటేషన్‌లో జిల్లాలో ఇప్పుడు 10 నియోజకవర్గాలుండగా వాటి సంఖ్య 13కు చేరుకోనున్నది సీఎం వెల్లడించారు. సంగారెడ్డితో పాటు మెదక్, సిద్దిపేట జిల్లాలు కొత్తగా ఆవిర్భవించనున్నాయన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజమణిమురళీయాదవ్, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. మెదక్ చర్చిని సందర్శించిన సీఎం కేసీఆర్: ఆసియాఖండంలోనే అతి పెద్దదైన మెదక్ చర్చిని కేసీఆర్ సందర్శించారు. ఘణపురం ఏరియల్ సర్వే అనంతరం మెదక్ పట్టణంలోని చర్చిని సందర్శించారు. సీఎం కేసీఆర్‌కు ప్రెసిబీటర్ ఇన్‌చార్జి రాబిన్‌సన్, అసిస్టెంట్ ప్రెసిబీటర్ ఇన్‌చార్జి విజయ్‌కుమార్ సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు
No comments:
Post a Comment