-ఏపీ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం
-ఇప్పటికే వాటాకు మించి వాడుకున్నారు
-కృష్ణా జలాల విషయంలో ఉమాభారతికి హరీశ్ ఫిర్యాదు
-తెలంగాణకు అన్యాయం జరిగితే ఒప్పుకోం
-నదుల అనుసంధానంపై సదస్సులో హరీశ్
కృష్ణానదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తనకు కేటాయించిన నీటికంటే అదనంగానే వాడుకున్నదని, అయినా మళ్లీ కృష్ణాజలాలపై రాద్ధాంతం చేస్తున్నదని కేంద్రమంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు.
నదుల అనుసంధానంపై కేంద్ర జల వనరుల శాఖ మంగళవారం ఏర్పాటుచేసిన అన్ని రాష్ర్టాల నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమాభారతితో ఆయన విడిగా సమావేశమై.. కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా కృష్ణాజలాలపై తమ వాదనతో కూడిన వినతిపత్రాలను కేంద్ర మంత్రికి సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తనకు కేటాయించిన వాటాకంటే 11 టీఎంసీల నీటిని ఎక్కువగా వాడుకున్నదని, తెలంగాణ రాష్ట్రం ఇంకా 112 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నదని కేంద్ర మంత్రికి హరీశ్‌రావు స్పష్టంచేశారు. తమకు అన్యాయం చేసే తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘనకు పాల్పడుతున్నదని ఆమెకు వివరించారు.
బచావత్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కలిపి 811 టీఎంసీల నీటిని కేటాయించారని, ఇందులో తెలంగాణ వాటా 299 టీఎంసీలు కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా 512 టీఎంసీలని పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరం రుతుపవనాల తర్వాతి పరిస్థితుల్లో నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో సుమారు 550 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని చెప్పారు. ఇందులో తెలంగాణకు 229 టీఎంసీల వాటా దక్కుతుందని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 117 టీఎంసీలను వాడుకున్నదని, ఇంకా 112 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 321 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా ఇప్పటికే 11 టీఎంసీల నీటిని అదనంగా వాడుకున్నదని వివరించారు. ఇంకా నాగార్జునసాగర్ నుంచి నీటిని కృష్ణా డెల్టా రైతాంగానికి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, బచావత్ ట్రిబ్యునల్ వెలువరించిన తుది ఉత్తర్వులకు భిన్నంగా ఏపీ వాదిస్తున్నదని వివరించారు. ఈ రెండు రిజర్వాయర్లలో ప్రస్తుతం 100 టీఎంసీల నీరు మాత్రమే లభ్యమవుతుందని, ఇంకా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని అన్నారు.
కేటాయించిన వాటాకు మించి వాడుకోవడమే కాకుండా.. రిజర్వాయర్లలో నీటి లభ్యత లేకపోయినా నీటిని ఇవ్వాలని ఆ రాష్ట్రం చేస్తున్న డిమాండ్‌ను తాము ఆమోదించేది లేదని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. కృష్ణా జలాల లభ్యత, వినియోగానికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ర్టాల కార్యదర్శులు, ఇంజినీర్ల స్థాయిలో జరిగిన సమావేశాల్లో ఆశించిన ఫలితాలు రాలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని ఇరుకున పెట్టడానికి, ఇబ్బందులకు గురిచేయడానికి, నష్టం చేయడానికే నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లపై పూర్తి అధికారాలను ఇవ్వాల్సిందిగా కృష్ణా నది నిర్వహణ బోర్డును ఏపీ కోరిందని ఆరోపించారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్లకు మోకాలడ్డడం కోసమే ఏపీ ఇలా చేస్తున్నదని, ఇందుకు డెల్టా రైతుల సాగునీటి అవసరాలను సాకుగా చూపుతున్నదని విమర్శించారు. అదనంగా వాడుకోవడమేకాకుండా.. ఇప్పుడు రిజర్వాయర్లపై అధికారాలు కోరడం తెలంగాణ అవసరాలను, హక్కులను బేఖాతరు చేయడమేనని ఉమాభారతికి హరీశ్ వివరించారు.
నాగార్జునసాగర్‌కు దిగువన ఉన్న కొన్ని ప్రాజెక్టులతో పాటు పాలేరు, మూసీ, మున్నేరు తదితరాలకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుల్లో అదనపు కేటాయింపులు లేవని, వీటికి అవసరమైన 231.350 టీఎంసీల నీటిని నిర్దిష్టంగా ఆ రాష్ర్టానికి కేటాయించిన వాటా నుంచే పంచుకోవాల్సి ఉంటుందని తుది తీర్పులో స్పష్టంగా ఉందని వివరించారు. కృష్ణా డెల్టాకు 60 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి తీసుకోవాలని స్పష్టం చేసిందని, మిగిలినదాన్ని ప్రకాశం బ్యారేజీ క్యాచ్‌మెంట్‌నుంచి సమకూర్చుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు.
ఆ రకంగా చూస్తే తెలంగాణకు 200.038 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 280.065 టీఎంసీల నీరు వస్తుందని (తుంగభధ్ర పరివాహక ప్రాంతంలోని 98.962 టీఎంసీలు పోను), ఆ విధంగా ఈ రెండు రాష్ర్టాలకు మొత్తం 480.688 టీఎంసీల నీరు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఆ విధంగా తెలంగాణకు 41.61%, ఆంధ్రప్రదేశ్‌కు 58.39% వస్తుందని తెలిపారు. ఈ ప్రకారం ఈ రెండు ప్రాంతాలూ వాటివాటి పరిధిలోని ప్రాజెక్టులకు కేటాయించిన నీటిని ఏ విధంగానైనా వాడుకునే స్వేచ్ఛను కూడా బచావత్ ట్రిబ్యునల్ కల్పించిందని గుర్తు చేశారు.
ఈ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఖరీఫ్ పంట సాగుబడి కోసం నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్‌ల నుంచి నీటిని వాడుకోవాలనుకుంటున్నదని స్పష్టం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అడ్డుపుల్లలు వేస్తూ నిబంధనలకు విరుద్దంగా లేనిపోని సాకులను చూపుతున్నదని, సహేతుకం కాని వాదనలకు దిగుతున్నదని ఆరోపించారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లలో 550.577 టీఎంసీల లభ్యత ఉండగా.. ఆంధ్రప్రదేశ్ వాటా 58.39% (321.482 టీఎంసీలు) అయినప్పటికీ ఇప్పటికే 333.150 టీఎంసీలను వాడుకున్నదని, ఇంకా వాడుకోవాలని చూస్తున్నదని మంత్రిదృష్టికి హరీశ్ తీసుకెళ్లారు.
డెల్టా ప్రాంతంలో ఖరీఫ్ పంట, తాగునీటి అవసరాలను చూపిస్తూ ఇంకా 267 టీఎంసీల నీటిని డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. రెండు రిజర్వాయర్లలో కలిపి 100.115 టీఎంసీలు మాత్రమే ఉన్నప్పుడు 267 టీఎంసీలను ఎలా వాడుకుంటుందని, ఎక్కడి నుంచి తెస్తుందని హరీశ్ ప్రశ్నించారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 టీఎంసీల (శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్-19 టీఎంసీలు, చెన్నై నగరానికి నీటి సరఫరా - 5 టీఎంసీలు కలిపి)ను మాత్రమే వాడుకోవాల్సి ఉందని, అయితే ఇప్పటికే 71.63 టీఎంసీల నీటిని వాడుకున్నదని మంత్రికి అందజేసిన విజ్ఞాపనపత్రాల్లో హరీశ్‌రావు పేర్కొన్నారు.
1996 జూన్ 15 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో నెం. 69) ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటి మట్టం ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం 847 అడుగులకు మట్టం పడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సార్బీసీ, హంద్రీ-నీవా అవసరాలకోసం నీటిని వాడుకుంటూనే ఉన్నదని ఆరోపించారు.
దేవాదుల ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులను విడుదల చేయండి
జే చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి ఏఐబీపీ (యాక్సెలెరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్) కింద రూ.103.725 కోట్లు తెలంగాణ రాష్ర్టానికి రావాల్సి ఉన్నదని ఉమాభారతికి హరీశ్ తెలిపారు. ఇప్పటికే ఈ విషయమై తమ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని, ప్రధాని కార్యాలయానికి, జల సంఘానికి (సెప్టెంబర్ 5, 2014, సెప్టెంబర్ 29, 2014తేదీల్లో) హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిఫారసు కూడా చేశారని చెప్పారు.
ఇంకా నిధుల విడుదల కాలేదని, వాటిని సత్వరమే విడుదల చేయాలని ఉమాభారతికి ఆయన విజ్ఞప్తి చేశారు. 2013-14 సంవత్సరానికి రూ.115.25 కోట్లు, 2014-15 సంవత్సరానికి రూ.125 కోట్ల చొప్పున మొత్తం రూ. 240.25 కోట్లు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నదని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జల సంఘం డైరెక్టర్ అక్టోబర్ 10వ తేదీన జలసంఘంలోని ప్రాజెక్టు మానిటరింగ్ అర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్‌కు సిఫారసు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఈ సాయాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని కోరారు. ఇదిలా ఉంటే.. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాలకు అనుగుణంగా నాగార్జునసాగర్‌లోని నీటిని వాడుకోడానికి అనుమతులు ఇప్పించాలని, డ్యాంపై నియంత్రణను ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి అప్పగించాలని ఉమాభారతికి అందించిన విజ్ఞాపన పత్రంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు.
No comments:
Post a Comment